Telugu News » Raashtra Effect : సాహితీ స్కామ్ పై రంగంలోకి స్పెషల్ టీమ్.. ‘రాష్ట్ర’ ఎఫెక్ట్

Raashtra Effect : సాహితీ స్కామ్ పై రంగంలోకి స్పెషల్ టీమ్.. ‘రాష్ట్ర’ ఎఫెక్ట్

సాహితీ ఇన్ఫ్రా 9 ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పటికైనా అతనిపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బు తిరిగి వచ్చేలా చూడాలని కోరుతున్నారు బాధితులు. తమ బాధను కళ్లకు కట్టేలా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ‘రాష్ట్ర’ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

by admin

– సాహితీ సంస్థకు బిగుస్తున్న ఉచ్చు
– ‘రాష్ట్ర’ కథనాలతో పోలీసుల చర్యలు
– బూదాటి భూమాయను తేల్చేందుకు ప్రత్యేక బృందం
– 9 ప్రాజెక్టుల్లో భారీగా మోసాలు
– రూ.18 వందల కోట్లకు పైగా స్కామ్
– ‘రాష్ట్ర’ అందించిన ఆధారాలతో చర్యలు ముమ్మరం

పాపం పండింది. ప్రజల ఆశలే పెట్టుబడిగా.. ధనార్జనే ధ్యేయంగా.. వేల కోట్లు కొట్టేసిన సాహితీ ఇన్ఫ్రా (Sahiti Infra) సంస్థ యజమాని బూదాటి లక్ష్మీ నారాయణ (Budati Lakshmi Narayana) కు ఉచ్చు బిగుసుకుంది. ఇతని పాపాలపై ‘రాష్ట్ర’ (Raashtra) అందించిన ఎక్స్ క్లూజివ్ కథనాలతో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బూదాటి 9 ప్రాజెక్టుల పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డాడని.. మొత్తం రూ.18 వందల కోట్లకు పైగా నొక్కేశాడని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే సాహితీ స్కామ్‌ దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు అయింది.

 

ఆధారాలతో సహా ‘రాష్ట్ర’ కథనాలు

బీఆర్ఎస్ అండదండలతో వేల కోట్లు దోచేసి దర్జాగా తిరుగుతున్నాడని బూదాటి అక్రమాలపై ‘రాష్ట్ర’ వరుస కథనాలు ఇచ్చింది. చేసిందంతా చేసి డబ్బంతా ఫినిక్స్ వంటి సంస్థలకు దోచిపెట్టి.. సొంత ఖర్చులకు వాడేసుకుని చివరకు చేతులెత్తేసిన లక్ష్మీనారాయణ.. అంతా మార్కెటింగ్ వాళ్లపై తోసేసే ప్రయత్నం చేయగా.. దానికి సంబంధించిన విషయాలను ఆధారాలతో సహా గత నెల 25వ తేదీన ‘బూదాటి బురిడీ లెక్క’ పేరుతో ‘రాష్ట్ర’ ఇన్వెస్టిగేషన్ కథనాన్ని ఇచ్చింది. అలాగే, అమీన్ పూర్ లో ప్రీలాంచ్ పేరుతో జరిగిన దోపిడీపై ఈనెల ఈనెల 3వ తేదీన లెక్కలతో సహా ‘ఎవరెవరికి ఎంత ముట్టింది’ అనే శీర్షికతో కథనాన్ని ఇచ్చింది. ‘రాష్ట్ర’ అందించిన ఈ కథనాలు పోలీసులకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలోనే బూదాటి లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు.

Raashtra story on Sahithi Infra scam

సాహితీ ఇన్ఫ్రాపై 50 కేసులు

జనం సొమ్ముతో జల్సారాయుడిలా మారిన లక్ష్మీనారాయణ.. వసూలు చేసిన సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు తేల్చారు పోలీసులు. భూములు కొనుగోలు చేయకున్నా ఫ్రీలాంచ్‌ పేరుతో వసూళ్లు చేసినట్టు గుర్తించారు. సాహితీ ఇన్ఫ్రా స్కామ్‌ రూ.18 వందల కోట్లుగా తేల్చిన పోలీసులు.. ఇప్పటివరకు 50 కేసులు నమోదు అయినట్టు తెలిపారు. ఫ్రీలాంచ్ పేరుతో పెద్దఎత్తున డబ్బు వసూలు చేసిన సాహితీ లెక్కలన్నీ బయటకు తీస్తామని చెబుతున్నారు. అయితే.. గతంలోనే ఓసారి జైలుకు వెళ్లొచ్చి బెయిల్ పై బయటకొచ్చిన బూదాటి.. తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదని.. కొందరు నాయకులు, పోలీసులతో కలిసి కుట్రలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

Raashtra story on Sahithi Infra scam 1

ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీ ఇదే!

సాహితీ ఇన్ఫ్రా 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేసింది. సాహితీ స్వాద్‌ పేరుతో రూ.65 కోట్లు, సిస్టాఅడోబ్‌ పేరుతో రూ.79 కోట్లు, సాహితీ గ్రీన్‌ పేరుతో రూ.40 కోట్లు, సాహితీ సితార పేరుతో రూ.135 కోట్లు, సాహితీ మెహతో పేరుతో రూ.44 కోట్లు, ఆనంద ఫర్చూన్‌ పేరుతో రూ.45 కోట్లు, సాహితీ కృతి పేరుతో రూ.16 కోట్లు, సాహితీ సుదిక్ష పేరుతో రూ.22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో రూ.7 కోట్ల వసూళ్లకు పాల్పడింది. చాలావరకు భూములు లేకున్నా.. ప్రజల నుంచి ఫ్లాట్స్ కోసం డబ్బులు ముందుగానే వసూలు చేసింది. ఇప్పటికైనా అతనిపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బు తిరిగి వచ్చేలా చూడాలని కోరుతున్నారు బాధితులు. తమ బాధను కళ్లకు కట్టేలా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ‘రాష్ట్ర’ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

You may also like

Leave a Comment