రైతుల(Farmers) కష్టాలు మాజీ సీఎం కేసీఆర్(KCR)కు పదేళ్ల తర్వాత తెలిశాయా అని మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan rao) ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు సార్లు అధికారం అనుభవించిన కేసీఆర్ పదేళ్ల కాలంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుమ్మక్కు అయ్యారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలకు అర్ధం అయిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 14 సీట్లు గెలవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ త్వరలో కనమరుగు కాబోతోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు వాస్తవ పరిస్థితులను వివరించి.. బీజేపీలోకి ఆహ్వానించాలని కాషాయ నేతలకు ఆయన సూచించారు.
అదేవిధంగా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపేనని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీజేపీ చేస్తోన్న అభివృద్ధి పనుల గురించి వివరించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు కేసీఆర్ తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి.. కాశీకి పోయినట్లు ఉందని రఘునందన్ రావు విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు మారిన వారిని కుక్కలు, నక్కలు అంటావా? గతంలో కేసీఆర్ ఇతరులను తన పార్టీలో చేర్చుకోలేదా? మరి మీరు చేర్చుకున్నప్పుడు కూడా వారు కుక్కలు, నక్కలేనా?’’ అని రఘునందన్ రావు ప్రశ్నించారు.