రేవంత్ రెడ్డిలా డ్యుయల్ రోల్ చేయడం తనకు చేతకాదని మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. అమీర్‌పేట్‌లోని ఆదిత్య హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ కేరళకు వెళ్లి కమ్యూనిస్టులను తిట్టివస్తే ఇక్కడేమో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమ్యూనిస్టులతో చర్చలు జరుపుతారని ఎద్దేవా చేశారు.
ఇంతకీ మేము ఎవరి మాట నమ్మాలంటూ ప్రశ్నించారు. ప్రజల్ని కాపాడాల్సిన సీఎం కన్నీరు పెట్టుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. రేవంత్ భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. బీజేపీ(BJP)కి డబుల్ డీజిట్ వస్తే తెలంగాణ(Telangana)లో జరిగే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో రేవంత్‌రెడ్డికి బాగా తెలుసని అన్నారు. అందుకే సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటేనని విమర్శించారు.
హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు అమలు చేయడం తమ వంతు అని చెప్పుకొచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలో కూడా హామీలు పెట్టిందని గుర్తు చేశారు. దుబ్బాకలో తాను ఓడిపోయానని విమర్శించిన హరీష్ రావు, రేవంత్‌లకు సెటైర్ వేశారు. కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర ఎలా చేపడతారు? అని ప్రశ్నించారు. 2018లో కొడంగల్‌లో ఓడిన రేవంత్ మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. రేవంత్ సీఎం అయ్యాక రూ.20 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు.
దుబ్బాకకు తాను ఏం చేశానో ఒక పుస్తకం తయారు చేసి మా నియోజక వర్గంలో 75 వేల మందికి పంపిణీ ఇస్తానని అన్నారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే.. మా గడిని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని తెలిపారు. దుబ్బాక అభివృద్ధిపై మీరెప్పుడు వచ్చినా నేను రెడీ అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ కేబినెట్లో బీసీలు ఎంత మంది ఉన్నారని నిలదీశారు. తాను ఉద్యమాలు చేసి వచ్చానని రఘునందన్ రావు తెలిపారు. తానూ కొడంగల్ వచ్చి బీ మీద మాట్లాడగలనని తెలిపారు.
తాను ఫెయిల్యూర్ ఎమ్మెల్యే కాదని, ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోట్ల వల్లే దుబ్బాకలో ఓడిపోయానని తెలిపారు. కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో రేవంత్ నడవడం దురదృష్టకరమన్నారు. మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ సర్వేలు చూసిన మోడీ మూడోసారి ప్రధాని అవుతారని వస్తున్నాయన్నారు. 400 సీట్లు లక్ష్యంగా ముందుకి వెళ్తున్నామని చెప్పారు. జూన్ 4 న మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.