సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్ధి రఘునందన్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. మెదక్ జిల్లాలో రఘునందన్ రావు (Raghunandan Rao)ని కొట్టడానికి ఈ జిల్లా వాడు ఒక్కడు దొరకలేదా అని ప్రశ్నించారు.. అందుకు పక్క జిల్లా వ్యక్తి కావలసి వచ్చిందా అని అన్నారు..
టైటానిక్ చరిత్ర బయటికి రావడానికి ఐదు వందల ఏళ్లు పట్టిందని తెలిపిన ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ (BRS) పరిస్థితి ఇలాగే మారుతుందని ఎద్దేవాచేశారు.. అదేవిధంగా హరీష్ రావు (Harish Rao)కు రెండోసారి మంత్రి పదవి ఇవ్వక పోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ కావొచ్చనే అనుమానాన్ని రఘు నందన్ వ్యక్తం చేశారు.. హరీష్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదో మాట్లాడి ఉంటే, కేసీఆర్ విని మంత్రి పదవి ఇవ్వలేదేమోనని అన్నారు..
తెలంగాణ (Telangana) ఉద్యమ సమయంలో రబ్బర్ చెప్పులతో వచ్చిన హరీష్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ములుగు మండలంలో చర్చ జరగాలని రఘునందన్ డిమాండ్ చేశారు.. ఇక త్వరలో ఈయన కూడా పార్టీ మారే అవకాశం ఉందని తెలిపారు.. ఆదేవిధంగా నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని హరీష్ రావు కాంగ్రెస్ (Congress) మీద చెప్తుండే.. ఇప్పుడు నేను ఎక్కను బిడ్డో కారులోకి అని నేతలు అంటున్నారని సెటైర్లు వేశారు..
సిద్దిపేటకు రైలుని ఇచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) చిత్ర పటాన్ని తన్నడం హరీష్ రావు కుటిలత్వానికి నిదర్శనమన్నారు.. కాట శ్రీనివాస్ ఓటమికి కారణమైన నీలం మదు, నోట్ల కట్టలు తెచ్చినందుకు మెదక్ అభ్యర్థి టికెట్ ఇచ్చినారని ఆరోపించారు.. నిన్నటిదాక దోచుకున్న, దాచుకొన్న వెంకట్రామరెడ్డి ప్రజా సేవ చేయడానికి రావడం సిగ్గుచేటని రఘునందన్ రావు మండిపడ్డారు..
సేవ చేయడానికి కాదు అక్రమంగా దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి వస్తున్నాడని వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు చేశారు.. ఇదిలా ఉండగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెడ్డిల అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన ఎలక్షన్ కమీషన్ రఘునందన్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర విచారణ జరిపి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పేర్కొంది..