ప్రధాని మోడీ ఇంటిపేరుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయంలో అపాలజీ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పడమంటే న్యాయప్రక్రియను అపహాస్యం చేసినట్టే అవుతుందని ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. నేను నిర్దోషిని.. మోడీ ఇంటిపేరుపై నేను చేసిన వ్యాఖ్యలకు నన్ను దోషిగా పేర్కొనడం సముచితం కాదు.. ఒకవేళ నాది నేరమే అయితే ఇంతకుముందే క్షమాపణ చెప్పేవాడిని అని ఆయన అన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ నేరం మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం జ్యూడిషియల్ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని పేర్కొన్నారు.
ఈ కేసులో సూరత్ కోర్టు తనకు విధించిన జైలు శిక్షపై స్టే విధించి.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని రాహుల్ కోరారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందుకు ఫిర్యాదుదారు పూర్ణేశ్ మోడీ తనను అహంకారి అని ఆరోపించారన్నారు. ఈ కేసు అసాధారణమైన కేటగిరీ కిందకు రాదనీ, శిక్షార్హమైన నేరమేదీ తాను చేయలేదని రాహుల్ తన అఫిడవిట్ లో వివరించారు. పూర్ణేశ్ మోడీ నాపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంలో కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ప్రచార సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మోడీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ ఆయనపై సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ కేసులో రాహుల్ దోషి అని పేర్కొంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన గుజరాత్ హైకోర్టు కెక్కగా.. సూరత్ కోర్టు ఉత్తర్వులు సక్రమమే అని ఈ కోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను రాహుల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇక ఈ పరువునష్టం కేసులో ఓ స్థానిక కోర్టులో వ్యక్తిగతంగా ఆయన హాజరు కాకుండా తాత్కాలిక ఊరటను బాంబే హైకోర్టు సెప్టెంబరు 26 వరకు పొడిగించింది.