కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చేదు అనుభవం ఎదురైంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ అక్కడ భటద్రవ తాన్ (సత్ర)ఆలయానికి వెళ్లారు. కానీ అక్కడ ఆలయంలోకి ఆయన్ని పోలీసులు అనుమతించలేదు. దీనిపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను ఆలయంలోకి ఎందుకు అనుమతించడం లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ…. మొదట తాము ఆలయాన్ని సందర్శించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారని చెప్పారు. కానీ ఇక్కడకు వచ్చాక తమను అనుమతించడం లేదన్నారు.
తాము ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నామని చెప్పారు. తాము ఇక్కడకు వచ్చింది ప్రార్థించడానికే తప్ప సమస్యలు సృష్టించడానికి కాదని వెల్లడించారు. ఇక్కడకు రాకూడనంత నేరం తాను ఏం చేశాను..? అని ప్రశ్నించారు. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనే అంశాన్ని కూడా ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీని మినహా కాంగ్రెస్ నేతలెవరినీ అధికారులు అనుమతించలేదు. ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైబోరాగావ్ వద్దే నేతలందిరినీ అడ్డుకున్నారు. అంతకు ముందు అనవసర పోటీ సృష్టించ వద్దని, రామ మందిర ప్రారంభోత్సవం పూర్తయిన తర్వాత ఆలయాన్ని దర్శించుకోవాలని రాహుల్ గాంధీకి అసోం సీఎం హిమంత బిస్వ శర్మ సూచించారు.