తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేసుకుంటున్న సమయంలో నేతలు దూకుడు పెంచారు. మూడు ప్రధాన పార్టీల నేతలు రాష్ట్ర పర్యటనలో సభలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అధికారం హస్తగతం చేసుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్ (Congress).. బీజేపీ (BJP) ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్న దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.. మరోవైపు అధికారం చేజారీ పోకుండా బీఆర్ఎస్ (BRS) వ్యూహాలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు పోలింగ్ కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించేందుకు.. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు హస్తం పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ. . బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా ప్రచారం చేస్తున్న రాహుల్.. బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెబుతూనే ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రచారం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆకస్మికంగా హైదరాబాద్ పర్యటించారు రాహుల్ గాంధీ. నగరంలోని ముషీరాబాద్, అశోక్‌నగర్‌లో పర్యటించిన రాహుల్ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేపర్ లీకేజీలు, నిలిచిపోయిన నోటిఫికేషన్ల ఘటనలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) దృష్టికి తీసుకెళ్లారు నిరుద్యోగులు..
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాహుల్.. నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర సమస్యలు తీరుస్తామని తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ చిక్కడపల్లి బావర్చి హోటల్ కు వెళ్ళి నిరుద్యోగులతో కలిసి బిర్యానీ తిన్నారు. అక్కడ కస్టమర్లను కలిసి ముచ్చటించారు..