Rahul Gandhi : కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్ సభలో ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్న వార్త సంచలనం రేపింది. తన పట్ల ఆయన ఇలా అనుచితంగా వ్యవహరిస్తూ సభ నుంచి వెళ్లిపోయారని స్మృతి ఇరానీ ఆరోపించారు. మహిళల పట్ల ఆయనకు ఏ మాత్రం గౌరవం ఉందో ఈ ఉదంతం తెలియజేస్తోందన్నారు. పార్లమెంట్ ను ప్రతివారూ గౌరవించవలసి ఉందన్నారు. గాంధీ కుటుంబం స్త్రీ ద్వేషి అన్న రీతిలో ఆమె మాట్లాడారు.
పార్లమెంటులో ఎంతోమంది మహిళలు ఉన్నారని, రాహుల్ అనుచిత ప్రవర్తన తననే గాక ఎంతోమంది మహిళలను కూడా బాధించి ఉంటుందని అన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలాంటి ఘటన ఏనాడూ జరగలేదని ఆమె చెప్పారు. మరో కేంద్ర మంత్రి శోభా కరంద్ లాజే కూడా రాహుల్ గాంధీని దుయ్యబట్టారు. తాము వెంటనే దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. అనంతరం బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు రాహుల్ గాంధీపై స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. మహిళా సాధికారత గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటారని, మహిళలకు వారిచ్చే గౌరవం ఇదేనా అని ఆ తరువాత వారు ప్రశ్నించారు.
రాహుల్ ప్రవర్తన సిగ్గుచేటు అని బీజేపీ జాతీయ అధికారప్రతినిధి షెహజాద్ పూనావాలా ఖండించారు. లోగడ ఆయన కన్ను గీటారని, ఇప్పుడు గాల్లోకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని .. ఇదేనా ఆయన సభ్యత అని పూనావాలా అన్నారు. కాగా రాహుల్ నిజంగా అలా ప్రవర్తించారా అన్న దానిపై సీసీకెమెరా ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాత్రం .. రాహుల్ ని చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే ఆ పార్టీ వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
మణిపూర్ ఈ దేశంలోని భాగమే
అంతకు ముందు అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో.. రాహుల్ గాంధీ ప్రసంగించిన తరువాత స్మృతి ఇరానీ .. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మణిపూర్ లో భరత మాతను చంపేశారన్న రాహుల్ కామెంట్ ని ఆమె దుయ్యబడుతూ.. మణిపూర్ ఈ దేశంలోని భాగమేనని, మీరే ఆ రాష్ట్రాన్ని వేరుగా చూస్తున్నారని అన్నారు. మీరు ‘ఇండియా’ కాదని, అవినీతికి ప్రతిరూపమని మండిపడ్డారు. భరత మాతను హత్య చేశారన్న మీ వ్యాఖ్యలను ఇండియా క్షమించదు.. జమ్మూ కశ్మీర్ లో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలు మీకు కనిపించలేదా ? రాజస్థాన్ లో ఓ మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన అఘాయిత్యాలపై మీరెందుకు స్పందించడం లేదు అని ఆమె ప్రశ్నించారు. మణిపూర్ రెండుగా చీలలేదని .. అది దేశంలో అంతర్భాగమన్నారు . భారత్ అంటే నార్త్ మాత్రమేనని విపక్ష కూటమి సభ్యుడొకరు తమిళనాడులో వ్యాఖ్యానించారని, మీకు ధైర్యం ఉంటే దీనిపై స్పందించాలన్నారు. జమ్మూ కశ్మీర్ కి 370 అధికరణాన్ని పునరుద్దరించాలనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు.