ఎప్పుడు వివాదాలను వైఫై లా తన చుట్టూ ఉండేలా చూసుకునే బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh).. గోషామహల్ (Goshamahal) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేదా అనేది అభ్యర్థులను ప్రకటించే వరకు సీక్రెట్ గా ఉంది.. కానీ చివరికి బీజేపీ అధిష్టానం ఆయనకే టికెట్ ఇచ్చింది.
ఇప్పుడు రాజాసింగ్ కు ఉన్న సమస్య నియోజక వర్గంలో మరోసారి సత్తాచాటి.. తన చరిష్మా తగ్గలేదని నిరూపించాలి.. ఈ లక్ష్యంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాజాసింగ్.. సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికలు తన జీవితానికి సంబంధించినవని తెలిపిన రాజా సింగ్.. తనను మోసం చేయాలని చూస్తున్న వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని మాస్ వార్నింగ్ ఇచ్చారు..
అంతేకాదు.. చంపడానికైనా.. చావడానికైనా సిద్దంగా ఉన్నట్టు రాజాసింగ్ హెచ్చరించారు.. తన చుట్టూ ఉన్న వారే తన వ్యూహాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారి అంతు చూస్తానంటూ రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.. తనను ఓడించటానికి . 2018 లో ప్రయత్నించిన వారి లిస్ట్ పదిలంగా ఉందన్న రాజాసింగ్.. ఎవరెవరు తన ప్రత్యర్థులతో టచ్‌లో ఉంటున్నారనే సమాచారం తన వద్ద ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం, ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని తెలిపిన రాజాసింగ్.. ధర్మాన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. మరోవైపు గతంలో గోషామహల్ నియోజక వర్గంలో రిగ్గింగ్ జరిగిందని.. ఈ ఎన్నికల్లో కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు కూడా చేశారు.