ప్రజాపాలన(Prajapalana) పథకం దరఖాస్తు ఫారానికి మీ సేవ కేంద్రాల్లో రూ.60 వసూలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) రాజాసింగ్ (Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తగిన ప్రచారం చేయలేదని ఆరోపించారు. దరఖాస్తు ఫారాలను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని రాజాసింగ్ మండిపడ్డారు. ప్రజాపాలన కార్యక్రమం నెల రోజులు పొడిగించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. వేలాది మంది దరఖాస్తుల కోసం వస్తే కేవలం ఒక్కో సెంటర్లో వంద మాత్రమే అందుబాటులో పెడుతున్నారని అన్నారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం ఫార్మ్‌లో ఎలాంటి వివరాలు లేవన్నారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం వైట్ పేపర్‌పై రాసి ఇవ్వాలని అంటున్నారని తెలిపారు.
ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ఇది కొనసాగితే ప్రజలకు ఫారమ్‌లు పూర్తిగా వివరణ ఇవ్వలేని పరిస్థితి ఉంటుందన్నారు. ప్రజాపాలన అంటే ముందుగానే ప్రజలకు దీనిపై అవగాహన ఇవ్వాలని తెలిపారు. గోషామహల్ నియోజక వర్గంలో 24 లోకేషన్లలో ప్లాన్ చేశారని, అక్కడ ప్రజాపాలన ఫామ్‌లు పెడుతున్నారని అన్నారు.
24 లొకేషన్ లో 100, 200 ఫామ్‌లు మాత్రమే పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ వారు సమావేశం పెడితే వారితో ముందుగానే చెప్పామన్నారు. ప్రజలకు సమాచారం అందించాలని, పేపర్ యాడ్ ఇవ్వాలని కోరామని తెలిపారు. ఏఏ సెంట్రల్లకు వెళ్లాలి, ఏతేదీలో వెళ్లాలని సమాచారం ఇవ్వాలని ముందే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు.