‘రాజధాని ఫైల్స్’(Rajadhani Files) సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. వైసీపీ(YCP) అభ్యంతరాలను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు(AP High Court) ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టే కొనసాగించేందుకు కోర్టు నిరాకరించింది.
రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో నేటి(శుక్రవారం) నుంచి సినిమా షోలు యథావిధిగా కొనసాగనున్నాయి. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు గురువారం అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఏపీ రాజధాని కథాంశంగా భాను తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే అలనాటి అందాల తార వాణీ విశ్వనాథ్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రాజధాని ఫైల్స్ గురువారం నుంచి థియేటర్లలో రిలీజ్ అయింది.
‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనను ఆపాలంటూ వైసీపీ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా ఈ సినిమా విడుదలపై అడ్డంకులను తొలగిస్తూ తీర్పునిచ్చింది.