కాంగ్రెస్ పార్టీ(Congress Party) తెలంగాణ(Telangana)లో ఒక్క ఏడాదే అధికారంలో ఉంటుందని గోషామహల్ ఎమ్మెల్యే(Ghoshamahal Mla) రాజాసింగ్(Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ (Hyderabad)లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డా.బీఆర్.అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమం మా పార్టీ కార్యాలయంలో నిర్వహించామని చెప్పుకొచ్చారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు గద్దె దించారని రాజాసింగ్ అన్నారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని, తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదనని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని.. ఆ అప్పులు పూడ్చడంతోనే కాంగ్రెస్ నాయకులకు సరిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అవుతుందన్న రాజాసింగ్ ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాజాసింగ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆరు నెలల్లో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అనడంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.