లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్(Rajasthan)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్(Former CM Ashok Gehlot)కు సన్నిహితుడైన మాజీ కేబినెట్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు లాలచంద్ కటారియాతో సహా 32 మంది పార్టీ నేతలు బీజేపీలో చేరారు.
రాజధాని జైపూర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం భజన్లాల్ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఈ నేతల మెగా చేరిక కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలలో ఇద్దరు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీలో చేరిన నేతలకు బీజేపీ నేతలు కండువా కప్పి స్వాగతం పలికారు.
రాజస్థాన్ రాజకీయాల్లో ఈ సమూల మార్పు కారణంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నాయకుల్లో నాగౌర్‌లోని చాలా మంది అనుభవజ్ఞులైన జాట్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నేతల ఈ మెగా చేరికతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. రాజస్థాన్‌లోని 25 స్థానాలకు గానూ 25 స్థానాలు గెలుచుకున్నట్లు బీజేపీ మరోసారి ప్రకటించింది.
గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లాలచంద్ కటారియా, రాజేంద్ర యాదవ్, మాజీ ఎమ్మెల్యే రిచ్పాల్ మిర్ధా, ఖిలాడీ లాల్ బైర్వా, అలోక్ బెనివాల్, విజయపాల్ మిర్దా, భిల్వారా జిల్లా మాజీ అధ్యక్షుడు రాంపాల్ శర్మ ఉన్నారు. అనంతరం లాల్ చంద్ కటారియా మాట్లాడుతూ.. మనస్సాక్షితోనే బీజేపీలో చేరానని, రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల్లో బీజేపీని ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రపంచంలో భారత్‌కు ప్రధాని మోడీ గుర్తింపు తెచ్చారన్నారు.