Rajasthani Turban : దేశ 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ (Modi) ధరించిన రాజస్థానీ (Rajasthani) స్టయిల్ తలపాగా (Turban) విశేషంగా ఆకర్షించింది. ఎప్పుడు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో వచ్చినా ఆయన స్పెషల్ డ్రెస్సులు, రంగుల తలపాగాలు ధరించి ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ సారి కూడా ఆఫ్ వైట్ కుర్తా, వైట్ ప్యాంట్స్, ధరించారు . 2014 నుంచి 2022 వరకు కూడా ఇండిపెండెన్స్ డే సందర్భాల్లో జాతీయ జెండా రంగులను పోలిన తలపాగాలు ధరించి మోడీ ఆకర్షించారు. 2021 లో ఎర్ర చారలతో కూడిన కాషాయ రంగు టర్బన్ ధరిస్తే 2022 లో కాషాయ రంగుతో బాటు క్రీమ్ కలర్ తలపాగా ధరించారు.
ఎప్పటిమాదిరే మంగళవారం ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ఆయన ఈ తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా మణిపూర్ అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. మణిపూర్ ప్రజల్లో భరోసా కల్పించేందుకు మోడీ ఈ సందర్భాన్ని ఎంచుకున్నారు. 2024 లో లోక్ సభ ఎన్నికలకు వెళ్లేముందు ఆయన చేసిన ఇండిపెండెన్స్ డే ప్రసంగం ఇదే చివరిది. ఇక తన ప్రసంగంలో ఆయన దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించారు.
పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలలను నెరేవేర్చేందుకు కొత్త పథకాన్ని ప్రకటిస్తామని, బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా ఈ స్కీం ఉంటుందన్నారు. చౌక ధరల్లో లభించే జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉండేట్టు జన ఔషధీ కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచుతామని, మార్కెట్ లో వంద రూపాయలకు లభించే మందులు ఈ కేంద్రాల్లో10 నుంచి 15 రూపాయలకే లభిస్తాయన్నారు.
తన ప్రసంగంలో ఆయన విపక్షాలను పరోక్షంగా విమర్శించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు కుటుంబ ప్రజాస్వామ్యానికి విఘాతంగా మారాయని, కుటుంబం చేత, కుటుంబం కోసం, కుటుంబానికే మేలు అన్నట్టుగా ఇవి తయారయ్యాయని, లోగడ ఇవి దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చాయని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి ఉందన్నారు. గత అయిదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినందుకు ఆనందంగా ఉందని మోడీ చెప్పారు.