తెలంగాణ (Telangana)లో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ (BRS) పరిస్థితి అయోమయంగా మారిందనే వార్తలు వ్యాపిస్తున్నాయి. తాము అధికారంలోకి రావడానికి పన్నిన వ్యూహాలే.. తిరిగి తమ నేతలను కోల్పోయేలా చేస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఎవరు ఉంటారో, ఎవరు పార్టీ వీడుతారో తెలియక తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు..
ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కొందరు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలవడం చర్చాంశనీయంగా మారింది.. అయితే తర్వాత క్లారిటీ ఇస్తున్నారు అనుకోండి. అది వేరే విషయం. కానీ ఇలా నేతలు సీఎం ను కలవడం అనేది బీఆర్ఎస్ కు ఎన్నటికైనా ముప్పే అంటున్నారు. ఇకపోతే గులాబీ ఎమ్మెల్యే ప్రకాష్ నిన్న రేవంత్ రెడ్డితో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆయన కాంగ్రెస్ (Congress)లో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) స్పందించారు. తన నియోజకవర్గ అభివృద్ధి, మూసీ సుందరీకరణ, రాజేంద్రనగర్ పరిధిలోని బహదూర్‌పూరా భూముల గురించి చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు స్పష్టం చేశారు. తన ప్రతిపాదనలకు సీఎం సానూకూలంగా స్పందించారని తెలిపారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలను ఖండించారు.
అలాంటి ఉద్దేశం తనకు లేదని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఉద్దేశం కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. అయితే ప్రకాష్ గౌడ్ క్లారిటీ ఇవ్వడంతో పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలకు చెక్ పడింది. ఇక ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. వారు కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని తెలపడంతో.. ప్రస్తుతం ఏదో జరుగుతుంది కానీ త్వరలో తెలుస్తోంది అనే అనుమానాలు కొందరు వెలిబుచ్చుతున్నారు..