చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజమండ్రి వెళతారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఆయన చెన్నై నుంచి రాజమండ్రికి వెళ్తారంటూ అటు తమిళ, ఇటు తెలుగు మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ ఫ్యామిలీ పంక్షన్ హాజరయ్యేందుకు రజనీకాంత్ ఆదివారం కోయంబత్తూర్ బయలుదేరారు. ఈ మేరకు ఆయన చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును కలిసేందుకు ఎప్పుడు వెళ్తారని ఈ సందర్బంగా ఆయన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దీనికి ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను చంద్రబాబును కలవాలని అనుకుంటున్నానన్నారు. కానీ ప్రస్తుతం ఫ్యామిలీ పంక్షన్ కు వెళ్తున్నానని చెప్పారు. ఫంక్షన్ కారణంగా తనకు సమయం అనుకూలించలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు రోజుల్లో ఆయన రాజమండ్రికి వచ్చే సూచనలు కనిపించడం లేదని అంతా అనుకుంటున్నారు.
ఇక ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. ఆయన అరెస్టు నేపథ్యంలో ఇటీవల లోకెశ్ కు రజనీకాంత్ ఫోన్ చేశారు. అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవని లోకేశ్ కు రజనీ ధైర్యం చెప్పారు. చంద్రబాబు ఒక గొప్ప పోరాట యోధుడని, ఈ పరిస్థితులను ఆయన సులభంగా అధిగమిస్తారంటూ ఆయనకు ధైర్యం నూరిపోశారు.