అమరావతి ఉద్యమనేత కొలికిపూడి శ్రీనివాస్ రావు (Kolikapudi Srinivasa Rao)పై ఏపీ డీజీపీకి డైరెక్టర్ రాం గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఫిర్యాదు చేశారు. కొలికిపూడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన కోరారు. తనపై కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తలను తీసుకు వచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ టీవీ డిబేట్లో కొలికిపూడి అన్నారని తెలిపారు.
తనను హత్యకు కొలికి పూడి డైరెక్ట్‌గా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. ఆ మాటను కొలికపూడి మూడు సార్లు చెప్పారని, ఆయన ముందే కుమ్మక్కై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొలికిపూడి వ్యాఖ్యలతో వేరే వ్యక్తులు స్ఫూర్తి పొందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదని ఆయన వెల్లడించారు.
సినిమా అనేది విమర్శ కాదని ఈ సందర్బంగా అన్నారు. వ్యూహం సినిమాకు టీడీపీ భయపడుతోందన్నారు. వ్యూహం సినిమాతో గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నంటు ఉందని ఎద్దేవా చేశారు. అంతకు ముందు అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ సమాజానికి కంటకంగా మారారని ఆరోపించారు.
రాంగోపాల్ వర్మ తలను నరికి తీసుకు వచ్చిన వారికి రూ. కోటి నజరానా ఇస్తామంటూ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమా ప్రజల ముందుకు రాబోతోంది. వైఎస్ జగన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చిరంజీవిలను కించపరిచేలా పాత్రల చిత్రీకరణ ఉందంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమాను నిలిపివేయాలంటూ నారా లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.