అయోధ్య(Ayodhya) రామాలయ(Ram Mandir) ప్రాణప్రతిష్ఠ మహోత్సవ నేపథ్యంలో దేశమంతా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. రాములోరి విగ్రహ ప్రతిష్ఠాపనను వీక్షించేందుకు కోట్లాది మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్య రామాలయాన్ని పోలిన మరో ఆలయాన్ని చండీగఢ్‌లో నిర్మించారు.
అయోధ్య వెళ్లలేని భక్తులు రామాలయ ప్రతిరూపంగా నిర్మించిన ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని కృపాకటాక్షాలకు పాత్రలు అవుతున్నారు. ఈ ఆలయ గోపురం 80 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో నిర్మించారు. శ్రీ రామ్ కృపా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాలను రూపొందించారు.
ప్రస్తుతం దర్శననిమిత్తం వచ్చిన భక్తులకు లడ్డూలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు రోజు మధ్యాహ్నం 3గంటలకు మొదటి కార్యక్రమం ప్రారంభమవుతుందని సేవా ట్రస్ట్ సభ్యుడు వెల్లడించారు. శ్రీరామ్ కృపా సేవా ట్రస్ట్ సభ్యులు ప్రదీప్ బన్సాల్ మాట్లాడుతూ.. కేవలం అయోధ్యలోనే కాకుండా చండీగఢ్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో అన్ని ఆలయాలు ప్రత్యేకంగా అలంకరించబడ్డాయని పేర్కొన్నారు.
500ఏళ్ల నాటి చరిత్ర సాకారం అవుతున్న వేళ ఈ అద్భుతమైన ఘట్టానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దశాబ్దాల నాటి ఉద్యమానికి నేడు ఫలితం దక్కనుందన్నారు. అందుకే లక్షలాది మంది అపారమైన భక్తివిశ్వాసాలతో ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించారు.