అయోధ్య(Ayodhya)లో బాల రాముడి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 22న అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై రామ మందిరాన్ని(Ram Mandir) ప్రారంభించారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవాన్ని చూశారు.
అయితే, ప్రాణప్రతిష్ఠ తర్వాత రోజు జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వారం వ్యవధిలో ఏకంగా 19లక్షల మంది భక్తులు అయోధ్య బాలక్‌రామ్(Balak Ram)ను దర్శించుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్(UP) నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
సగటు ప్రతీ రోజూ 2లక్షల కన్నా ఎక్కువ మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది. జనవరి 23న ఆలయాన్ని తెరిచిన తొలిరోజే ఐదు లక్షల మంది భక్తులు పూజలు చేయడంతో రద్దీ ఎక్కువగా ఉంది. తరువాతి రోజుల్లో 24వ తేదీన 2.5 లక్షల మంది, 25 తేదీన 2 లక్షల మంది, 26న 3.5 లక్షల మంది దర్శించుకున్నారు.
అదేవిధంగా 27వ తేదీన 2.5 లక్షల మంది, 28న 3.25 లక్షల మంది బాల రామున్ని దర్శించుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను నిశితంగా గమనించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.