అయోధ్య (Ayodhya)లో మరో మూడు రోజుల్లో రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే గర్బగుడిలో రామ్ లల్లా (Ram Lalla) విగ్రహాన్ని ప్రతిష్టించారు. రామ్ లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసి తరించాలని భక్తులంతా ఎదురు చూస్తున్నారు. రామ మందిరం గురించి ప్రతి విషయాన్ని భక్తులు ఆసక్తిగా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో రాముని ప్రసాదం పేరిట భక్తులను బురిడి కొట్టించేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అవుతున్నారు.
రామ మందిర ప్రసాదాన్ని ఆన్ లైన్లో విక్రయిస్తున్నామంటూ లింకులు పంపుతున్నారు. ఈ క్రమంలో పొరపాటున లింకులను ఓపెన్ చేస్తే వెంటనే అకౌంట్లు ఖాళీ అవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు హెచ్చరిస్తోంది. తాము అయోధ్య ప్రసాదాన్ని ప్రస్తుతానికి ఆన్ లైన్లో విక్రయించడం లేదని స్పష్టం చేసింది. ప్రసాదాన్ని ఆన్ లైన్లో పంపిణీ చేసేందుకు తాము విక్రేతలను గానీ, ఏజెన్సీలను గాన నియమించుకోలేదని పేర్కొంది.
ఇటీవల అయోధ్య ప్రసాదాన్ని ఆన్లైన్ లో విక్రయిస్తున్నారంటూ ముంబైకి చెందిన అనిల్ పరాంజీ అనే వ్యక్తికి మెసేజ్ వచ్చింది. దీంతో అనుమానంతో ఆయన ట్రస్టు సభ్యులను సంప్రదించారు. దీంతో ఆ మెసేజ్ ఫేక్ అని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ‘ఖాదీ ఆర్గానిక్’, ‘మందిర్ దర్శన్’పేరుతో కొన్ని వెబ్ సైట్లు ఆన్లైన్లో రామ మందిర ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్టు చెబుతున్నాయి. ఇంటికే ప్రసాదాన్ని డెలివరీ చేస్తామని ప్రచారం చేస్తున్నాయన్నారు.
రామాలయ ట్రస్టు అనేది లాభాపేక్ష లేని సంస్థ అని ట్రస్ట్ క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జ్ ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. అయోధ్యను దర్శించుకునే భక్తులకు ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉచితంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు. తాము ఇప్పటి వరకు ఎలాంటి ఆన్ లైన్ సేవలు ప్రారంభించలేదని తెలిపారు. రామ మందిరం, ట్రస్టు పేరుతో ప్రసాదం విక్రయిస్తామంటే వాటిని నమ్మొద్దని చెప్పారు.