అయోధ్య(Ayodhya)లో బాల రామచంద్రుడిని దర్శించుకోవడానికి మంగళవారం నుంచి దర్శనభాగ్యం కల్పించిన సంగతి తెలిసిందే. ‘బాలక్ రామ్’(Balak Ram)ను కనులారా చూసి తరలించేందుకు లక్షలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా అయోధ్యాపురికి చేరుకుంటున్నారు. రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగింది.
కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు లక్షమంది శ్రీరాముడిని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో రద్దీని అదుపు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
మంగళవారం సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచిఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం కూడా ఆలయంలో రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఉత్తరప్రదేశ్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఎస్ఎస్బీ సహా దాదాపు 8,000 మంది భద్రతా సిబ్బంది ఆలయం వద్ద మోహరించినట్లు అయోధ్య ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. భక్తులు బాలరాముడి దర్శనం కోసం తొందరపడొద్దని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు రెండు వారాల తర్వాత తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని కోరారు. ఇబ్బందులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.