– సంచలన ట్వీట్ చేసిన రమణ దీక్షితులు
– ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తిరుమలను రక్షించండి
– హిందూ దేవాలయాల సంప్రదాయాలను కాపాడండి
– నిర్మాణాలు, ఆస్తులను పరిరక్షించండి
– హిందూ రాష్ట్రాన్ని స్థాపించండి
– ప్రధాని మోడీకి ప్రత్యేక వినతి
శేషాచలం సానువుల్లో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala). రోజూ వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీనివాసుడి సేవలో తరిస్తుంటారు. వీవీఐపీలు కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా తిరుమలకు రాకుండా ఉండరు. తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ (PM Modi).. తిరుమలకు వెళ్లారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే.. తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ పోస్ట్ పై స్పందించిన రమణ దీక్షితులు.. ‘‘తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉంది. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలి. హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమపద్ధతిలో నాశనం చేస్తున్నాడు. దయచేసి శ్రీవారి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు’’ అని మోడీని కోరారు రమణ దీక్షితులు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. గతంలోనూ రమణ దీక్షితులు చేసిన ట్వీట్లు తెరపైకి వస్తున్నాయి.
తిరుమల ఆలయంతో పాటు ఏపీలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు జరుగుతున్నాయని హిందూ సంస్థలు చాలాకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తుండడం, షాపులు ఏర్పాటు చేసుకుంటుండడంపై అభ్యంతరం చెబుతున్నాయి. అయినా కూడా దేవాదాయ శాఖ తన తీరు మార్చుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో రమణ దీక్షితులు తిరుమల ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని మోడీని కోరడం చర్చనీయాంశంగా మారింది.
చాలాకాలంగా ఈ డిమాండ్ ను వినిపిస్తున్నారు రమణ దీక్షితులు. జగన్ సీఎం అయ్యాక.. అర్చక హోదాలో తనకు ఆలయ ప్రవేశం కచ్చితంగా జరుగుతుందని రమణ దీక్షితులు ఆశించారు. కానీ, ఆయన్ను ఆలయ గౌరవ ప్రధాన అర్చక హోదాకే పరిమితం చేశారు. అయితే.. తనకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక హోదా ఇవ్వాలని ప్రభుత్వం, టీటీడీ అధికారులను కోరుతూ వస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో అవకాశం దొరికినప్పుడల్లా ట్విట్టర్ లో టీటీడీ అధికారులను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు రమణ దీక్షితులు. చిన్న అంశాన్ని సైతం పట్టుకుని సంచలన ఆరోపణలు చేస్తూ జగన్ ను సైతం ట్యాగ్ చేస్తున్నారు. ఏపీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ప్రధాని తిరుమల పర్యటన నేపథ్యంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు.