సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటిపై స్పందించే వారే కరువైయ్యారని అనుకొంటారు.. కానీ కొంతమంది మాత్రం అప్పుడప్పుడు ఆ సమస్యలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడానికి తోచిన ప్రయత్నం చేయడం కనిపిస్తోంది. కొందరు అయితే ఏకంగా ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు, ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తుంటారు. కాగా ఈ సమస్యలపై చిన్నపిల్లలు సైతం స్పందించిన రోజులు ఉన్నాయి..
లోకం అంటే పూర్తిగా ఆగాహన లేని కొందరు చిన్నారులు సైతం తమవంతుగా సమస్యలపై స్పందించడం కొందరిని ఆలోచింప చేస్తోంది. ప్రస్తుతం ఓ చిన్నారి చేసిన పని పలువురిని అబ్బురపరుస్తోంది. తాజాగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి 5వ తరగతి చదువుతోన్న చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ.. అంజలి అనే విద్యార్థిని సీఎంను లేఖలో కోరింది.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) ఆధిబట్లకు చెందిన విద్యార్థిని అంజలి రాసిన లేఖ పరిశీలిస్తే.. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమష్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి” అని లేఖ రాసి పోస్ట్ చేసింది. తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ అందించాలంటూ విన్నవించింది..
అయితే చిన్నారి అంజలి రాసిన లేఖ ఇప్పుడు వైరల్గా మారింది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉచిత కరెంటును స్కూళ్లకు సైతం ఇవ్వాలంటూ లేఖ రాయడం పట్ల ఆ విద్యార్ధినిని అందరూ అభినందిస్తున్నారు.