మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ (Madhya Pradesh left arm pacer) కుల్వంత్ కేజ్రాలియా (Kulwant Kejraliya) రికార్డు సృష్టించాడు. రంజీల్లో ఏకంగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కుల్వంత్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బరోడా సెకండ్ ఇన్నింగ్స్ 95వ ఓవర్లలో కుల్వంత్ ఈ రికార్డును నెలకొల్పాడు. 95వ ఓవర్‌లోని 2,3, 4, 5 బంతులకు కుల్వంత్ కేజ్రాలియా వికెట్లను పడగొట్టాడు.
మధ్యప్రదేశ్ బ్యాటర్లు షెష్వాత్ రావత్, మహేష్ పీతియా, భార్గవ్ భట్, ఆకాశ్ సింగ్‌లను ఔట్ చేశాడు. ఇంతకుముందు ఢిల్లీ బౌలర్ శంకర్ సైనీ(1988), జమ్మూ కశ్మీర్ బౌలర్ మొహమ్మద్ ముదాసిర్ (2018)లు రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. మధ్యప్రదేశ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా రంజీల్లో హ్యాట్రిక్ సాధించిన 80వ క్రికెటర్ కుల్వంత్ నిలిచాడు.
ఈ ఘనతతో అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కొత్త రికార్డు కుల్వంత్ సొంతమైంది. ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. వారిలో శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ, వెస్టిండీస్ వెటరన్ పేసర్ ఆండ్రీ రసెల్, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది, ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ఉన్నారు. భారత బౌలర్లలో కుల్వంత్ ఒక్కడే ఆ రికార్డును సాధించడం విశేషం.