పశ్చిమబెంగాల్(West Bengal)లో రేషన్ పంపిణీ కుంభకోణం(Ration Distribution Scam) సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈడీ(ED).. అధికారపార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. తాజాగా మరో నేతను అదుపులోకి తీసుకున్నారు.
పీడీఎస్ స్కామ్లో ఇప్పటికే టీఎంసీ (TMC) నేతలను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విస్తృత సోదాల అనంతరం బాంగావ్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శంకర్ ఆధ్యాను(Shankar Adhya) అధికారులు అరెస్టు చేశారు. అయితే విచారణలో సహకరించినప్పటికీ తన భర్తను అరెస్ట్ చేశారని శంకర్ సతీమణి జ్యోత్స్న తెలిపారు.
రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి శంకర్ అధ్యా, మరో టీఎంసీ నాయకుడు సహజాన్ షేక్ ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. బెంగాల్లో లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ సరుకుల్లో నిందితులు దాదాపు 30 శాతం బహిరంగ మార్కెట్కు తరలించారని ఈడీ పేర్కొంది.
సహజన్ షేక్ మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడి చేశారు. దాదాపు 800 నుంచి వెయ్యి మంది అధికారులు, భద్రతా సిబ్బందిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని ఘెరావ్ చేశారని ఈడీ పేర్కొన్నది. ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, పర్సులు వంటివి కూడా దోచుకెళ్లారని, దాడిలో పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. గాయాలైన అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు.