తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందుకు వచ్చారు మాజీ ఆర్బీఐ గవర్నర్(RBI Ex Governor) రఘురామ్ రాజన్(Raghuram Rajan). ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)తో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా రఘురామరాజన్ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. అయితే, ఇటీవలే రఘురామ్ రాజన్ ఓ ఇటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దని సూచించిన విషయం తెలిసిందే.
ఆ ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడుతూ.. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. పేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమైనా కొన్న రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వరాదని హెచ్చరించారు. ప్రస్తుత వృద్ధిరేటులో భారత్ అభివృద్ధి చెందడం కష్టమని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక ఉచితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవలే ‘మహాలక్ష్మి’ పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలు సరికాదని వ్యాఖ్యానించిన రఘురామ్ రాజన్.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.