RBI : దేశంలో ద్రవ్యోల్బణం పెరిగినా రెపోరేటును రిజర్వ్ బ్యాంక్ మార్చలేదని, ఈ రేటును 6.50 శాతం వద్దే ఉంచామని బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) తెలిపారు. ఈ మేరకు ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి కమిటీ (Monetary Policy Committee) నిర్ణయించిందని ఆయన చెప్పారు. రెపో రేట్లను ఈ కమిటీ మార్చకపోవడం ఇది మూడో సారి. ఎకనామిస్టులు ఊహించినట్టుగానే కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నదని దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం లక్ష్యతా పరిధి అయిన 4 శాతం కంటే ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు. మంగళవారం ప్రారంభమైన మానిటరింగ్ కమిటీ సమావేశ నిర్ణయాలను ఆయన గురువారం వెల్లడించారు.
ఇక స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్ స్టాండింగ్ ఫెసిలిటీ యథాతథంగా 6.75 శాతం చొప్పున ఉంటాయన్నారు. గత కొన్ని నెలలుగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కూరగాయల ధరలు పెరిగాయని, ఎల్-నినో వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆహారోత్పత్తుల ధరలు పెరిగిన విషయాన్నీ విస్మరించరాదన్నారు. ఏమైనా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గత ఏడాది మే నుంచి వరుసగా ఆరు విడతల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచిందన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయని, కానీ గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 10.6 బిలియన్ డాలర్లమేర ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పుంజుకున్నాయని, ఖరీఫ్ సీజన్ పంటలతో ఆర్ధిక వ్యవస్థ మరింత ముందుకు వెళ్లగలదని ఆశిస్తున్నామని నిపుణులు పేర్కొంటున్నారు.
. టమాటా, పప్పు ధాన్యాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల రిటైల్ (Retail) ద్రవ్యోల్బణ అంచనాలను సవరించామని మానిటరింగ్ పాలసీ కమిటీ వివరించింది. 2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో కేంద్రానికి డివిడెండ్ తో మిగులు ద్రవ్యం పెరిగినట్టు అంచనా వేశారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2 శాతం, మూడో త్రైమాసికంలో 5.7, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు.