రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. తాజాగా రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. భారత వృద్ధిరేటు చాలా మంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతోందని గవర్నర్ (Governor) శక్తికాంత దాస్ (Shaktikanta Das)తెలిపారు.
దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయించిందని తెలిపారు.
ఈ నిర్ణయం స్థూలంగా ఆర్థికవేత్తలు ఊహించిన దానికి అనుగుణంగానే ఉందని అన్నారు. పరిణామం చెందుతున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ 5 నుంచి 1 మెజారిటీతో పాలసీ రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందని, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25 శాతంగా ఉందని, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు 6.75 శాతంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2024లో స్థిరంగా ఉంటుందన్నారు. మరోవైపు ఆర్బీఐ ఈ రెపోరేటును యథాతథంగా కొనసాగించడం ఇది ఆరోసారి.