తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ (Delhi) పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలిసి యూపీఎస్సీ పనితీరు పరిశీలించి తెలుసుకోన్నారు.. కాగా యూపీఎస్సీ చైర్మన్ (UPSC Chairman)ని కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరికొందరు ఉన్నతాధికారులు ఉన్నారు..
మరోవైపు రేవంత్ రెడ్డి గురువారం కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరీలతో భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
అలాగే విభజన సమస్యలను కూడా అమిత్ షా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, పదో షెడ్యూల్ లోని సంస్థలపై ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేశారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే.. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి విదితమే.. అదేవిధంగా ఏటా జాబ్ క్యాలండర్ సైతం ప్రకటించింది. ఇందులో భాగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు టీఎస్పీఎస్సీపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు.. కానీ ఇంకా వీరి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపలేదు..