– మంత్రికి దగ్గరి వారి ఇళ్లలో ఐటీ సోదాలు
– ల్యాండ్ డీలింగ్స్ లింకులే కారణమా?
– ప్రదీప్ రెడ్డితో మొదలై సబిత వరకు ఐటీ అధికారులు వెళ్తారా?
– ఈమధ్య వరుసగా లీడర్ల ఇళ్లలో సోదాలు
– అక్రమంగా డబ్బు చేతులు మారుతోందా?
తెలంగాణ (Telangana) లో ఓవైపు ఎన్నికల సందడి నెలకొనగా.. ఇంకోవైపు ఆదాయ పన్ను శాఖ తన పని చేసుకుపోతోంది. పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలవ్వగా.. ఐటీ (IT) అధికారులు తనిఖీల్లో బిజీ అయ్యారు. వరుసగా దాడులు చేస్తూ నాయకులు, వ్యాపారులకు టెన్షన్ పుట్టిస్తున్నారు. సోమవారం ఉదయం నగరంలోని పలుచోట్ల అధికారులు సోదాలకు దిగారు. దాదాపు 15 చోట్ల తనిఖీలు చేపట్టారు. అయితే.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) బంధువులు, అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు జరపడం చర్చనీయాంశమైంది.
సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి (Kartik Reddy) స్నేహితుడైన ప్రదీప్ రెడ్డి (Pradeep Reddy) ఇళ్లలో తనిఖీలకు దిగింది ఐటీ శాఖ. ప్రదీప్ ఎక్కువగా ల్యాండ్ డీలింగ్స్ చేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో వేల కోట్ల బిజినెస్ చేశాడని ఆయా వర్గాల్లో టాక్ ఉంది. ఓ పోలీస్ అధికారితో చేతులు కలిపి భూదందాలు చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ టార్గెట్ గా సోదాలు జరపడం… పైకి అని పేరు చెబుతున్నా అంతర్గతంగా కార్తీక్ రెడ్డి, సబితే లక్ష్యమని తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ ఉన్నా కూడా భూములను అగ్రిమెంట్ చేసుకుని డబ్బు బదలాయింపులు జరుగుతున్నాయి. హవాలా రూపంలో కూడా నగదు బదిలీ అవుతోంది. ఈ వ్యవహారాల్లో ప్రదీప్ రెడ్డికి నైపుణ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతోనే అతని ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక, ఎన్నికల సందర్భంగా కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్ సొమ్ము చేతులు మారుతున్నట్టు ఐటీ శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే సోదాలకు దిగిందని అంతా అనుకుంటున్నారు.
నెల రోజుల క్రితం కూడా గుట్టల బేగంపేట్ లోని వందల ఎకరాల భూమికి ఎసరు పెట్టారని.. అందుకు అనుకూలంగా పేపర్స్ రెడీ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది 5వేల కోట్ల డీల్ అని సమాచారం. ఇందులో ఓ డీసీపీ ఇన్వాల్స్ అయినట్టు తెలుస్తోంది. నార్సింగ్ లోనూ అత్యంత ఖరీదైన భూమిపై కన్నేశారని.. కొంతమంది అధికారులు ఎలక్షన్ డ్యూటీ తో బిజీగా ఉంటుంటే.. ఈ డీసీపీ టీం మాత్రం భూ కబ్జాలను ప్రొత్సహిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొజిషన్ లేని భూములకు సంబంధించి బెదిరింపులకు పాల్పడి అన్నీ సెట్ చేయిస్తున్నారని అనుకుంటున్నారు. దీనికోసం స్పెషల్ ఆపరేషన్ టీంని అనధికారికంగా వాడుకుంటున్నారని సమాచారం. ఈ ల్యాండ్ డీలింగ్స్ లెక్కలు బయటకు తీసేందుకే ఐటీ రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది.