Telugu News » Kaleswaram : నిండా ముంచుతున్న కాళేశ్వరం!

Kaleswaram : నిండా ముంచుతున్న కాళేశ్వరం!

ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న సీఎం.. ఏ సభలోనూ మేడిగడ్డ ప్రస్తావన లేకుండానే ప్రసంగాన్ని ముగిస్తున్నారు. అయితే.. ఎన్నికల ముందు దొరికిన ఈ అస్త్రాన్ని విపక్షాలు గట్టిగానే ప్రయోగిస్తున్నాయి.

by admin
medigadda barrage

– కేసీఆర్ కలల ప్రాజెక్ట్
– నాలుగేళ్లకే ప్రశ్నార్థకంగా బ్యారేజ్
– ఎన్నికల వేళ ఫుల్ డ్యామేజ్
– మౌనంగా కేసీఆర్
– మేడిగడ్డ ఊసే లేకుండా మీటింగ్స్
– సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం
– రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం

ఎన్నికల వేళ కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్ బీఆర్ఎస్ (BRS) కు తలనొప్పిగా మారింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోవడంతో ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచస్థాయిలో అద్భుతమంటూ తెగ ఊదరగొట్టిన కేసీఆర్ (KCR) సర్కార్.. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు వెలుగుచూడడంతో సైలెంట్ అయిపోయింది. ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న సీఎం.. ఏ సభలోనూ మేడిగడ్డ ప్రస్తావన లేకుండానే ప్రసంగాన్ని ముగిస్తున్నారు. అయితే.. ఎన్నికల ముందు దొరికిన ఈ అస్త్రాన్ని విపక్షాలు గట్టిగానే ప్రయోగిస్తున్నాయి.

medigadda barrage

కాళేశ్వరం అద్భుతమంటూ ప్రచారం

కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతం అంటూ తెగ ప్రచారం చేశారు కేసీఆర్. ఇత‌ర గులాబీ నేత‌లు కూడా రాష్ట్ర‌మంతా కాళేశ్వ‌రం నీళ్లే పారుతున్నాయ‌నేంత స్థాయిలో ప్రజలకు వినిపిస్తూ వచ్చారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు ఎవ‌రు వెళ్లినా కాళేశ్వ‌రంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ చేసి చూపించే వార‌ని వార్తలు వచ్చాయి. కేసీఆర్ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ తక్కువ సమయంలో కుంగిపోవ‌డం అధికార బీఆర్ఎస్‌ కు ఇప్పుడు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లైంది. 7 బూజ్ ఖలీఫాలకు సరిపడా కాంక్రీట్, 15 ఈఫెల్ టవర్లకు సరిపడా ఉక్కు, 6 పిరమిడ్ల పరిమాణంలో తవ్విన మట్టి అంటూ నిర్మాణ సంస్థ, ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్నా.. చివరకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

అంత రహస్యమెందుకు..?

మేడిగడ్డ గేట్ల బరువును ఆపే స్తంభాల వంటి నిర్మాణాలు ఒక్కొక్కటి 110 మీటర్ల పొడవు, 25 మీటర్ల ఎత్తున కాంక్రీట్ తో నిర్మించారు. వీటిలో ఒకటే కుంగిపోయింది. అయితే.. అంతా రహస్యంగా ఉంచడమే అనుమానాలకు తావిస్తోంది. మీడియాను అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. గతంలో కాళేశ్వరం పంప్ హౌస్ లు మునిగినప్పుడు కూడా ఇలాగే చేశారు. ప్రతిపక్షాలు, మీడియాకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇప్పుడు కూడా అదే గోప్యత పాటిస్తోంది ప్రభుత్వం. అధికారులయితే ఇందులో కుట్ర కోణం ఉందని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రతిపక్షాలు ఇదంతా డ్రామాగా చెబుతున్నాయి. కుట్ర కోణం అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మండిపడుతున్నాయి.

ప్రశ్నార్థకంగా నీటి ఎత్తిపోత

2016లో శంకుస్థాపన చేసుకున్న మేడిగడ్డ బ్యారేజ్ 2019లో పూర్తయింది. నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,850 కోట్లు ఖర్చు చేసింది. 16 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉండేలా నిర్మాణం జరిగింది. మొత్తం 85 గేట్లను ఏర్పాటు చేశారు. చాలా తక్కువ టైమ్ లోనే పూర్తి చేశామని నిర్మాణ సంస్థ, ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకున్నాయి. అయితే.. తాజా ఘటనతో నీరు నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. నీటిని మొత్తాన్ని దిగువకు వదిలేశారు. అంటే, ప్రాణహిత నుంచి వచ్చే నీటిని ఆపడం కుదరదు. దీనివల్ల, సుందిళ్ల, అన్నారం దగ్గరకు నీటిని మళ్లించడం సాధ్యం కాని పని. అంటే, మొత్తం ప్రాజెక్టుకు గండి పడే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. పునాదుల నిర్మాణంలో లోపం వల్లే ఇది జరిగిందని.. ఫౌండేషన్ సరిగ్గా లేదని చెబుతున్నారు. కింద ఉన్న ఇసుక కొట్టుకుంటూ పోవడం వల్లే పిల్లర్ కుంగిందని చెబుతున్నారు. ఇసుకలో పునాది నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర కమిటీ అసహనం

మేడిగడ్డ ఘటనపై తెలంగాణకు కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్‌ భద్రత అథారిటీ మరో లేఖ రాసింది. ఆదివారం లోగా వివరాలు ఇవ్వాలని పేర్కొంది. ఈనెల 23 నుంచి 26 వరకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఆ సమయంలో కొంత సమాచారం ఇచ్చారని కేంద్ర కమిటీ తెలిపింది. ఇంకా సమాచారం కావాలని అడిగినా ఇవ్వకపోవడంతో తాజాగా లేఖ రాసింది. 20 అంశాల సమాచారం కోరినట్లు కేంద్ర జలమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చారని.. ఒక దానికి పాక్షికంగానే సమాచారం ఇచ్చారని పేర్కొంది. ఆదివారం లోగా అన్ని వివరాలు పంపాలని రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ కు కేంద్ర జలమంత్రిత్వ శాఖ డైరెక్టర్ లేఖ రాశారు.

You may also like

Leave a Comment