అగ్రరాజ్యం అమెరికా (America) అధ్యక్షుడిగా మరోసారి పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడో ఎలక్షన్లోనూ ఘన విజయం సాధించారు. వర్జిన్ ఐలాండ్స్ (Virgin Islands)లో గురువారం జరిగిన ఎన్నికలో 73 శాతం ఓట్లు సాధించి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి నిక్కి హేలీ కేవలం 26 శాతం ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యారు.
ఎన్నికల ఫలితాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. గెలుస్తామని ముందే ఊహించాం. కానీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తామని మాత్రం అనుకోలేదంటూ పేర్కొన్నారు. మీరు అందించిన ఈ విజయాన్ని ఎప్పుడూ మరిచిపోనని తెలిపారు. అయితే, వర్జినియా ఎన్నికల్లో అధికారులు నిబంధనలు పాటించలేదు. అనుమతించిన దానికంటే ముందుగానే పోటీని నిర్వహించారని అన్నారు.
మరోవైపు ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసులో ఆయన ఉంటారా లేదా అన్నదానిపై అమెరికా సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. 2020అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్, క్యాపిటల్ హిల్‌పై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ కేసు ట్రంప్ మెడకు చుట్టుకొంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ 3వ సెక్షన్ ప్రకారం ఏదైనా పదవీ ప్రమాణం చేసి తిరుగుబాటుకు పాల్పడిన వారు తిరిగి ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టేందుకు వీలు లేదు.
ఈ సెక్షన్ ఆధారంగా కొందరు ఓటర్లు కొలరాడో సుప్రీం కోర్టులో ఇప్పటికే కేసు వేశారు. అందులో ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో ట్రంప్‌ను కొలరాడో ప్రైమరీ బ్యాలెట్‌లో పోటీ నుంచి తొలగించారు. అయితే తాజగా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం కోర్టులో అప్పీల్ చేశారు. ఇది ట్రంప్ కు వర్తిస్తుందా లేదా అనేది తేల్చడంతో పాటు కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణ జరగనుంది.