ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందిస్తూ వివిధ దారుల్లో ఆదాయ మార్గాలను టీఎస్ ఆర్టీసీ (TSRTC) ఇప్పటికే సృష్టించుకోంది. పండగల సమయాల్లో అయితే ప్రత్యేక ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తూ సర్వీసు అందిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో పెద్ద పండుగలు అయినా బతుకమ్మ (Batukamma), దసరా (Dussehra) రోజుల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తారు.
ఈ అవకాశాన్ని ఆదాయంగా మార్చుకోవడానికి సిద్దమైన టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి 23 వరకు, 28 నుంచి 30 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకుల కోసం లక్కీడ్రా నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ప్రయాణం సాగించిన ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత టిక్కెట్ వెనుక పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన బాక్సులో వేయాలని తెలిపింది.
ఈ లక్కీడ్రా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 11 రీజియన్ల నుంచి ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేసి, వారికి ఒక్కొక్కరికీ రూ.9,900 చొప్పున నగదు బహమతులు అందించనున్నట్టు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఎంపిక చేసిన విజేతలకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేస్తారని తెలిపింది.
మరోవైపు పండగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన యాజమాన్యం.. ఎంజీబీఎస్ నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడపడం వల్ల, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే మెహిదీపట్నం, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరంగర్ క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల నుంచి సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అంతే కాకుండా 50 కిలోల కంటే ఎక్కువ బరువున్న లగేజీపై విధించే ఛార్జీలు 20 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ ఎ. పురుషోత్తం నాయక్ వెల్లడించారు. హైదరాబాద్ నగరం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని నెలాఖరు వరకు వినియోగించుకోవచ్చని అన్నారు.