తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉద్యమం నాటినుంచే కేసీఆర్ (KCR)పై, ఆయన కుటుంబంపై తీవ్రపదజాలంతో విరుచుకుపడే నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని, దొరల గడీలు బద్దలు కొట్టే రోజు వస్తుందని ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి తెలిపారు.. అన్నట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడింది..
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పటి నుంచి రేవంత్ ఎన్నో మార్పులకి శ్రీకారం చూట్టారని జనం అనుకొంటున్నారు.. ఇకపోతే జనవరి 15-19 తేదీల మధ్య దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు దావోస్‌కు వెళ్లనున్నారు.
ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో వందకుపైగా దేశాల నుంచి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. మన దేశం నుంచి కేంద్ర మంత్రులతో వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు సైతం ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కాగా ల్యాబ్ నుంచి లైఫ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్ అనే అంశంతో ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
మరోవైపు గత పదేళ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన విధానాన్ని.. ఇక్కడ పెట్టుబడుల వల్ల కలిగే లాభాలను ఈ సదస్సులో వివరించి.. మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి సమావేశం ఉంటుందని అధికారిక సమాచారం.. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి.. నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదీగాక ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు..