– కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ కీలక సూచన
– సమరానికి సిద్ధం కావాలని పిలుపు
– నెల రోజుల పాటు గ్రామగ్రామానికి కాంగ్రెస్
– ప్రతీ ఇంటికి వెళ్లాలన్న రేవంత్
పార్టీ శ్రేణులకు కొత్త నినాదాన్ని వినిపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై ఇక సమరమేనని.. తిరగబడదాం-తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. సమయం లేదని.. నెల రోజుల పాటు గ్రామ గ్రామాన ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు రేవంత్. ఈక్రమంలోనే గులాబీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 12వేల గ్రామాల్లో, 3వేల డివిజన్లలో సమావేశాలు నిర్వహిస్తామని.. గడప గడపకు వెళ్లి 75లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవాలని తెలిపారు.
ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీదే విజయమని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మారుస్తామని ప్రకటించారు. అలాగే, ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు, కళాకారులకు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని తెలిపారు.