మంత్రి కేటీఆర్ (KTR)పై టీపీసీసీ చీఫ్ (TPCC Chief) రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు అంటూ ఫైర్ అయ్యారు. రైతులపై మంత్రి కేటీఆర్‌కు ప్రేమ ఉంటే నవంబర్ 2లోగా రైతు బంధు డబ్బులు ఇవ్వాలని అన్నారు. వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపే పించన్ ఇవ్వాలన్నారు.
ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వాలన్నారు. తాము ఎన్నికల సంఘానికి చెప్పిన విషయం కూడా ఇదేనన్నారు. ‘నిజం చెప్పులు తొడుక్కునే లోపు.. అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది’అని సామెత నీలాంటి వాళ్లను చూసే పుట్టిందని పేర్కొన్నారు. ఇకనైనా డ్రామాలు ఆపి నవంబర్ 2 లోగా లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలన్నారు.
వచ్చే నెల 2 లోగా అలా చేయకపోతే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందన్నారు. మరో వైపు రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుకు వ్యతిరేంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అవలంభిస్తున్న రైతు వ్యతిరేక వైఖరి పై ప్రతి నియోజక వర్గం, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు.