కాంగ్రెస్ అధికారంలో వచ్చాక తొలి సంతకం ఆరు గ్యారెంటీల (Six guarentees ) పైనే చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆ ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగును నింపబోతున్నాయని చెప్పారు. ఆరు గ్యారెంటీలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని పేర్కొన్నారు. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిన మరుసటి రోజు నుంచే కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు.
విజయ దశమి నుంచి పార్టీ తరఫున విస్తృత కార్యక్రమాలకు కార్యాచరణను రూపొందించామన్నారు. అభ్యర్థుల ఎంపిక అనేది తమ ప్రాధాన్యత కాదన్నారు. ప్రజలకు ఏం ఇవ్వాలన్నదే తమ ప్రాధాన్యత అని అన్నారు. అభ్యర్థుల ఎంపికపై తమకు ఓ ప్లాన్ ఉందన్నారు. ఓట్లను చీల్చేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్లు ఎటువైపు ఉన్నారో వారే సమాధానం చెప్పాలన్నారు.
ప్రధాని మోడీ చెప్పింది అసత్యమైతే ఆయన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. అందుకే బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. అందుకే గత ఎన్నికల్లో బీజేపీ ఓటు బీఆర్ఎస్ కు బదిలీ అయిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన ఎంపీ స్థానాల్లో
బీఆర్ఎస్ సహకారంతో బీజేపీ గెలిచిందన్నారు.
రాజకీయ స్వలాభం కోసం దివంగత నేత వాజ్పాయిని కూడా వాడుకున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి ఏం ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు తెలంగాణకు ఎందుకు వస్తున్నారంటూ ఆయన నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ల కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
కల్వకుంట్ల కుటుంబం అందినకాడికి దోచుకుందని విరుచుకు పడ్డారు. అమరవీరులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలు సంబురం చేసుకోవాల్సిన సమయం ఇదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెర వేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. మద్యం దుఖాణాలు పెంచి ప్రజల ఆరోగ్యాలతో కేసీఆర్ చెలగాటం ఆడారన్ని ధ్వజమెత్తారు.
సంపద పెంచాలి, పేదలకు పంచాలనేదే తమ విధానమన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసహనంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణకు పట్టిన పీడా నుంచి విముక్తి లభించబోతోందన్నారు. తెలంగాణ ప్రజలు సంబు రాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దసరాను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. కేసీఆర్ ముక్త తెలంగాణకు ప్రజలందరూ ముందుకు రావాలన్నారు.