బీఆర్ఎస్ (BRS) నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు.. అధికారం కోల్పోయిన దుఃఖంలో ఉన్న కేసీఆర్ (KCR) కాస్త ఆలోచించి మాట్లాడాలని సూచించారు.. పదవిని అడ్డుపెట్టుకొని చేసిన పాపాల వల్లనే ఈ రోజు వారికి ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.. కాంగ్రెస్ (Congress) వచ్చింది.. కరువు తెచ్చిందని మాట్లాడే ముందు..పదేళ్ళు మీరున్నారన్న విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు..
ఎన్నికలు రాగానే రైతులు గుర్తుకు వచ్చిన కేసీఆర్.. పొలం బాట పట్టడం మంచిదేనని అన్నారు.. బీఆర్ఎస్ చేసిన పాపాలు తమకు అంటగట్టి బద్నాం చేయడంలాంటి విద్యలలో కేసీఆర్ ఆరితేరారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే భయంతో డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ విమర్శించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ (Tukkuguda)లో ఈ నెల 6న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుంది.
ఈ మేరకు సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు పరిశీలించారు. అనంతరం ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏఐసీసీ మ్యానిఫెస్టో సైతం ఈ సభలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రాష్ట్రానికి జరిగే మేలును ఈ సభ ద్వారా తెలియజేస్తామన్నారు.
మరోవైపు కేసీఆర్ సూర్యపేటలో జనరేటర్‌తో ప్రెస్ మీట్ పెట్టి, విద్యుత్ పోయిందని ప్రభుత్వంపై నిందలు వేయడం ఆయన పెద్దరికానికి మచ్చగా పేర్కొన్నారు.. అదీగాక బీఆర్ఎస్ హయాంలో ఏదైనా కార్యక్రమానికి మేము పిలుపునిస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.. ఒకవేళ మీలాగే మేము ఆలోచిస్తే.. మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేవారా అని రేవంత్ ప్రశ్నిస్తారు..
బీఆర్ఎస్ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి.. రైతులకు ఓ 100 కోట్లు సహాయం చేయోచ్చు కదా అని తెలిపిన రేవంత్ ఎన్నికల కోసమే కేసీఆర్ యాత్ర మొదలుపెట్టారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఢిల్లీ వెళ్తున్నాం. పదేళ్లుగా మీరు చేసిన పాపాలను కడిగే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్ రద్దైన వెయ్యి రూపాయల నోట్ల లాంటివారని ఎద్దేవా చేసిన సీఎం.. మోడీ (Modi), కేసీఆర్ ఒక్కటే.. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని ఆరోపించారు..
కాంగ్రెస్ కు 40 వస్తే .. మోడీ కి 400 వస్తాయని కేటీఆర్ ఓప్పుకున్నట్లేనా అని ప్రశ్నించిన రేవంత్.. చనిపోయిన రైతు ల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్ కు 48 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు. ఆ వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు..