తెలంగాణ (Telangana) రాజకీయాల్లో వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. సీఎం పదవి చేబట్టినప్పటి నుంచి మాటల్లో దూకుడు తగ్గించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy).. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ (KCR) పై విరుచుకుపడ్డారు. నల్గొండ (Nalgonda)కు వెళ్లి బీరాలు పలుకుతున్న పెద్దమనిషి, శాసనసభకు రావాలంటే వంద సాకులు చూపించడం సభ్యత కాదంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలిచ్చే బర్రె కాదు ఓ కంచర గాడిద అంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ తాను అసెంబ్లీ నుంచి వస్తుండగా ఓ అటెండర్ తనను పలకరించినట్లు తెలిపిన సీఎం.. తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసుగుర్రాన్ని తెచ్చుకున్నామని, ఏ రేస్ కు వెళ్లినా ఆ గుర్రానిదే గెలుపని, ఆ కంచర గాడిదకు మళ్లీ అధికారం అనేది కలలో మాట అని తెలిపినట్లు వెల్లడించారు. ఓ అటెండర్ కు ఉన్న ఇంగిత జ్ఞానం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయనకు ఎందుకు లేదని ప్రశ్నించారు..
నేడు ఎల్బీ స్టేడియంలో జరిగిన పోలీస్ ఉద్యోగాల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో గర్జించారు.. మళ్లీ వస్తానని అంటున్న కేసీఆర్.. ఒక వేళ రావాలి అనుకుంటే జైలుకే వెళ్తాడని విమర్శించారు. తెలంగాణను తన కుటుంబం కోసం దోచుకొని నాశనం పట్టించిన కేసీఆర్ ఇప్పుడు సానుభూతి కోసం చంపుతానంటున్నారంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
పిట్టల దొరలా మాట్లాడుతున్న కేసీఆర్ మాటల మాయలో పడవద్దని సూచించిన సీఎం.. ప్రజల పక్షాన 24 గంటలు పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే రాబోయే పదేళ్లు నేనే సీఎం బాధ్యతల్లో ఉంటానని.. ఆ పై పదేళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందన్నారు. కేసీఆర్ నీకు చేతనైతే నా వెంట్రుక పీకి చూపించు. నీకు నేనేంటో తెలుస్తదని రేవంత్ దుయ్యబట్టారు..
రాష్ట్రానికి పదేళ్లు సీఎంగా ఉండి తేవాల్సిన నీళ్లు తీసుకురాలేదు. ప్రాజెక్టులు కట్టలేదు. కానీ మరణించిన ఉద్యమ కారుల బొందల గడ్డ మీద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని తోపులా ఫీలవుతున్నావని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి 69 రోజులైంది. అప్పుడే ఏం చేయలేదని శాపనార్ధాలు పెడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బాగోతం బయటపడుతుందని కృష్ణాజలాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.