తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఈ కార్యక్రమానికి అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే సభలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Soniya Gandhi) సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు.
ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. వారితో పాటు మరికొందరికి రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందుతోంది. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారంలో ఓ దివ్యాంగురాలికి తొలి ఉద్యోగం కల్పిస్తూ రేవంత్‌రెడ్డి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో ఓ దివ్యాంగ యువతికి కూడా తొలి ఉద్యోగం ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ యువతికి ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి ఆ దివ్యాంగురాలికి ఇచ్చిన హామీ మేరకు గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఆ యువతి కల నెరవేరనుంది.
నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన రజిని దివ్యాంగురాలు. ఈమె పీజీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటీ రాలేదు. దివ్యాంగురాలని ప్రైవేట్ సంస్థలూ అవకాశం ఇవ్వలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఎన్నికల సమయంలో గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో చలించిపోయిన రేవంత్‌రెడ్డి తాను సీఎం అయ్యాక తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.