తెలంగాణ (Telangana) ఆర్టీసీ (RTC) ఉద్యోగులు కొందరు తమ గోడు వెళ్లబోసుకొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాసానికి చేరుకొన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో తమను చిన్న చిన్న కారణాలతో తొలగించారని.. తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై స్పందించి ఆదుకోవాలని సీఎంను వేడుకొన్నారు.
మరోవైపు బుధవారం ఉదయం ఆయన ఇంటి వద్దకు వెళ్ళిన ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకొన్నారు. అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగులు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు చెందిన ఉద్యోగులకు అన్యాయం జరిగిందని తమ సమస్యలను చెప్పుకొనేందుకు ఎండీ సజ్జనార్ కార్యాలయానికి కాదు కదా కనీసం ఆర్ఎం కార్యాలయం వద్దకు కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న చిన్న కారణాలతో 1000 మందిని గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల నుంచి తొలగించారని వెల్లడించారు. బస్సు టైర్లు పంక్చర్ అయినా, అనారోగ్యం కారణాలతో సెలవు పెట్టినా తమను డ్యూటీలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి ఆదుకొని తమ ఉద్యోగులు తిరిగి ఇప్పించాలని కోరారు.
మరోవైపు గతంలోనే కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ అప్పటి ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అశ్వత్ధామరెడ్డి పెద్ద ఉద్యమాన్నే లేవనెత్తారు. ఆ సమయం నుంచి ఆర్టీసీ నష్టాల బాట పట్టిందనే ఆరోపణలున్నాయి.. ఉద్యోగుల కష్టాలు కూడా అప్పటి నుంచి మొదలైనట్టు ప్రచారం జరిగింది.