తెలంగాణ (Telangana)లో అధికారం కోసం యుద్ధం నడుస్తుందా? అన్నట్టుగా రాజకీయాలు సాగుతోన్నాయనే చర్చ మొదలైనట్టు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు కొత్త ప్రభుత్వానికి సహకరించడం మాట అటుంచితే.. పదవులు పోయాయనే బాధలో నోటికి వచ్చినట్టు మాట్లాడుతోన్నారని అనుకొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొత్తలో కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం ఉండేది 6 నెలలు లేదా ఏడాది మాత్రమే అని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈమేరకు కొందరిలో గులాబీ నేతల వ్యాఖ్యలపై పలు అనుమానాలు మొదలైనట్టు ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ (Congress) లో గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలను లాగి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా..? అనే సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
అరడజను మంది అటు ఇటు అయితే ఖేల్ ఖతమే కదా! అని సీఎం ను ఇంటర్వ్యూ తీసుకొంటున్న మీడియా సంస్థ అధినేత ప్రశ్నించగా.. ఇలాంటి వాటికి తెరలేస్తే ఏది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరూ ఊహించరని సమాధానం ఇచ్చారు. తాను జానారెడ్డిని మాత్రం కాదన్నారు. నిజాయితీగా తీర్పు ఇచ్చిన ప్రజలు.. రాష్ట్ర బాధ్యతను తమకు అప్పచెప్పారని తెలిపారు.. అందరూ ప్రజా తీర్పును గౌరవించాలనే కోరుకుంటున్నానన్నారు.
ఒక వేళ తెగబడటం మొదలైతే తాము తగ్గేది లేదని ప్రత్యర్థి పార్టీలకు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన అరచకానికి అడ్డు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కున్న కేసీఆర్.. పదేళ్ల తర్వాత నిలదొక్కుకున్నారా అని ప్రశ్నించారు. వారిలా తాము పొరపాట్లు చేయమని అన్నారు. కాదని ప్రత్యర్థులు గేమ్ మొదలు పెడితే.. తాము ఆడే ఆటలో అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.