తాజాగా రైతుబంధు పంపిణీ తాత్కాలికంగా నిలిపి వేయాలని ఈసీ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిరాశలో ఉన్న రైతులకు రైతుబంధు నిలిపివేత నిరాశ కలిగించే అంశమే అయినా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో గులాబీ నేతల అత్యుత్సాహం వల్ల ఇలా జరిగిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పై టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పెద్దలకు రైతుబంధు పంపిణీ వరంగా మారింది.. కానీ రైతుబంధు పంపిణీకి ఈసీ ఇచ్చిన అనుమతిని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుబంధు అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా అల్లుళ్లకు లేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
తెలంగాణను దోచుకోవాలనే ఆశచాలక.. మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తూ.. ఓటర్లను మభ్యపెట్టడానికి హరీష్ రావు (Harish Rao) వ్యాఖ్యలు చేయడం వల్లే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని రద్దు అయ్యిందని రేవంత్ ఆరోపించారు.. అవినీతి అనే ఆయస్కాంతానికి ఇనుప ముక్కలా అంటుకున్న ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని రేవంత్ విమర్శించారు.. రైతులు ఆందోళన చెందవద్దన్న రేవంత్.. కాంగ్రెస్ వచ్చిన 15 రోజుల్లో రైతుబంధు డబ్బులు పంపిణీ చేస్తామని తెలిపారు..