– 2024-25 బడ్జెట్‌పై రేవంత్ సర్కార్ కసరత్తు..
– కొత్త వాహనాలు కొనుగోలు చేయవద్దన్న సీఎం..
– ప్రభుత్వ ఖర్చులపై కోత..
ప్రత్యేక తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత మొదటి సారిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాల గురించిన వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోందని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దుబారా ఖర్చులను నిలిపివేసి 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం, వ్యయం, ఆరు హామీల అమలుకు నిధుల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ నేపథ్యంలో వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత? ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతోంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు.. చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు.
కాగా గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిందనే ఆరోపణలు మెండుగా ఉన్న నేపథ్యంలో, రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తుంది. ఏమాత్రం తేడా వచ్చిన ప్రతిపక్షాల ఆరోపణలు నిజం అని జనం భావించే అవకాశం ఉండటంతో.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా రేవంత్ సర్కార్ ముందుకి వెళ్తుందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా అవసరమైనప్పుడు మాత్రమే ప్రకటనలను విడుదల చేయాలని, కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా ప్రస్తుతమున్న వాహనాలనే వినియోగించాలని సీఎం ఆదేశించారు. కాంగ్రెస్ మీద జనానికి నమ్మకం కలిగేలా పాలన చేయడంలో రేవంత్ సర్కార్ విజయాన్ని సాధిస్తుందా? లేక అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ వ్యూహాలకి చిక్కుతుందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ లా మారింది..