బిహార్(Bihar)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)జరిగింది. టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. రామఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖిసరాయ్ సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బుధవారం తెల్లవారుజామున టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ సికంద్రాలో క్యాటరింగ్ పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు లభిసరాయ్ రైల్వే స్టేషను బయలుదేరారు. ఇంతలో ఎన్హెచ్-30పై వేగంగా వచ్చిన లారీ టెంపోను ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది మృతుల్లో టెంపో డ్రైవర్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుల బంధువులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బంధువులు వచ్చిన తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.