శ్రీకాకుళం (Srikakulam) జిల్లా పలాస (Palasa) సమీపంలో నెమలినారాయణపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. రెండు టూరిస్ట్ బస్సులు ఢీకొనగా ఒకరు దుర్మరణం పాలైనారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 98 మంది యాత్రికులు రెండు టూరిస్టు బస్సుల్లో ఒడిశా (Odisha)కు వెళ్లి పూరీ జగన్నాథుడిని దర్శించుకొన్నారు. అనంతరం వారు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు..
ఈ క్రమంలో పలాస సమీపంలో జాతీయ రహదారిపై బస్సు సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, సుమారు 30 మందికి తీవ్ర గాయాలేనట్టు సమాచారం. ఈమేరకు సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని పలాస ప్రభుత్వాసుత్రికి తరలించారు.
మరోవైపు మేడ్చల్ (Medical) పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం కంపెనీ వద్ద బైక్ ను వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా మటన్ కోసం వచ్చి మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. కాగా మరణించిన వ్యక్తి ఎల్లంపేట గ్రామానికి చెందినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొన్నట్టు సమాచారం..
మరోవైపు మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా కంబాలపల్లి గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా గుండ్ల సింగారం గ్రామంలో గల బుడియా బాపు దేవుడిని దర్శించుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కంబాలపల్లి గ్రామ సమీపంలో ఎదురుగ వచ్చిన కారు ఆటోను ఢీ కొట్టినట్టు సమాచారం.