– పదేళ్లలో ఒక్క ఉద్యోగమైనా భర్తీ అయిందా?
– నిరుద్యోగులు ఆలోచన చేయాలి
– పైసల కోసమే టీఎస్పీఎస్సీ నడుస్తోంది
– పేపర్లు లీకేజ్ వెనుక ప్రభుత్వ హస్తముంది
– టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై..
– నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం
– హాజరైన రేవంత్, కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్
ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రక్షాళనపై నిరుద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) హాజరయ్యారు. కేసీఆర్ (KCR) సర్కార్ పై విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంతమంది బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తామన్నారు. కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. మీనాన్న వల్ల కాదంటూ మంత్రి కేటీఆర్ ను హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు. గుమాస్తా స్థాయివారిని సభ్యులను చేయడంతోనే బోర్డు ఇలా తయారైందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రద్దు అయితేనే నిరుద్యోగులకు రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని అన్నారు రేవంత్. నిరుద్యోగులకు కాంగ్రెస్ సెల్ ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. తమ 6 గ్యారెంటీలను చూసి తండ్రీకొడులకు చలి జ్వరం పట్టుకుందని కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి విమర్శించారు.
కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదికలు చెప్పాయి.. ఆ సంఖ్య ఇప్పుడు 3 లక్షలకు పైగానే ఉంటుందన్నారు. ఎన్నికలు రాగానే నోటిఫికేషన్.. అయ్యాక కోర్టులకు పోయి రద్దు.. కేసీఆర్ పాలనలో ఇదే సాగుతోందని మండిపడ్డారు. అన్ని రంగాలను డబ్బులు సంపాదించే మిషన్ గా ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ‘‘ప్రశ్నాపత్రాలు అమ్ముకోవాలి.. పైసలు సంపాదించాలి. 16 పరీక్షా పత్రాలు లీకైతే.. నిర్వహించే వారిని తీసేయాలి.. కానీ, కేసీఆర్ చేశారు? ఈ ప్రభుత్వం మేల్కొనదు.. పరీక్షలు జరపడం చేతగాని వారికి అధికారం ఎందుకు?’’ అంటూ విరుచుకుపడ్డారు.
ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు వీరోచిత పోరాటం చేస్తున్నారని అన్నారు. సెట్రల్ లైబ్రరీలో ఒక్కపూట అన్నం తిని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని.. వాళ్ల జీవితాలను ప్రబుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ మీద ఎవరికీ నమ్మకం లేదన్న ఆయన.. చైర్మన్ జనార్ధన్ రెడ్డి, బోర్డు సభ్యులకు నైతిక విలువులు ఉంటే అర్జెంట్ గా పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా పేపర్లను టీఎస్పీఎస్సీ అమ్ముకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ మీద కూడా ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు ఆర్ఎస్పీ.