ఉక్రెయిన్(Ukraine) లోని పోక్రోమ్స్ నగరంపై రష్యా(Russia) శనివారం మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 11మంది సాధారణ ప్రజలు మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు ఉక్రెయిన్ నియంత్రణలోని డొనెట్క్స్ గవర్నర్ వెల్లడించారు.
రష్యా తన ఎస్-300 మిస్సైళ్లతో దాడి చేసిందని, ఆరు భవనాలు నేలమట్టమయ్యాయని డొనెట్క్స్ రిజినల్ హెడ్ తెలిపారు. సహాయ చర్యలకు సంబంధించి ఫొటోలను ఆయన విడుదల చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై జరిగే ప్రతీ దాడికి రష్యా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రష్యా మరోసారి ఉద్దేశపూర్వకంగా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటుందని జెలెన్క్సీ ఆరోపించారు. రష్యాను ఉగ్రవాద రాజ్యంగా ఆయన అభివర్ణించారు. గతేడాది డిసెంబర్లో ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద దాడి చేసింది. 122కి పైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో కనీసం 39 మంది మృతిచెందారు.
23 నెలలుగా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియడంలేదు. ఫిబ్రవరి 24 నాటికి ఈ యుద్ధం మొదలై రెండేళ్లవుతుంది. ఈ సుదీర్ఘ యుద్ధంలో ఇరు దేశాలు చాలా నష్టపోయాయి.