రైతుబంధు (Rythu Bandhu) నిలిపివేత విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పరిస్థితి.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు తయారైందని అనుకుంటున్నారు. ఏదో రైతుబంధు పేరు చెప్పుకుని నాలుగు ఓట్లు ఎక్కువ తెచ్చుకుందామని చేసిన ప్రదర్శన వికటించడంతో.. కారు పరిస్థితి కత్తెరలో పోకచెక్కలా మారిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..
ఇప్పటికే ఈ విషయంలో రేవంత్ కామెంట్స్ చేయగా.. తాజాగా ఇదే అంశమై మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పందించారు. జహీరాబాద్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు.. రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని తెలుపడం కూడా తప్పా? అని ప్రశ్నించారు. నోటికాడికి వచ్చిన ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటోందని మంత్రి విమర్శించారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ రైతుబంధు ఇవ్వొద్దని ఈసీకి ఫిర్యాదు చేసిందని హరీష్ రావు ఆరోపణలు చేశారు. రైతుబంధు దుబారా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారని హరీష్ రావు గుర్తు చేశారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారో చూస్తామని హరీష్ రావు మండిపడ్డారు. అధికారంలోకి మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని తెలిపిన హరీష్ రావు.. 3వ తేదీ తర్వాత రైతుబంధు డబ్బులు అకౌంట్ లో పడతాయని తెలిపారు.
మరోవైపు ఈసీ నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. కాంగ్రెస్ నేతలు రైతుల నోటికాడి ముద్దను లాక్కున్నారని ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈసీ స్పష్టంగా హరీష్ రావు పేరును మెన్షన్ చేసిన తర్వాత కూడా మళ్లీ కాంగ్రెస్ను బద్నాం చేయడం ఏంటని మండి పడుతున్నారు. కవిత వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నాడు గీరాల్సిన అగ్గిపుల్ల ఇప్పుడు గీరిండు.. అగ్గిపెట్టె మచ్చ అంటూ హరీష్ రావును ఉద్దేశించి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.