ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియో(Deep Fake Video)లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ(AI Technology) సాయంతో వీడియోలను మార్ఫింగ్ చేస్తుండడం కలకలం రేపుతోంది. తాజాగా క్రికెట్ స్టార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా డీఫ్‌ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే.
సచిన్ ఓ ఆన్లైన్ గేమ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వాయిస్‌తో ఓ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. డీప్‌ఫేక్‌తో టెక్నాలజీతో ఈ వీడియోను రూపొందించారు. దీనిపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు అనుగుణంగా ఉండేలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం కింద కఠినమైన నిబంధనలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
వీడియోను గురించి చెప్పినందుకు సచిన్ టెండూల్కర్‌కు కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఏఐతో కూడిన డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం.. భారతీయ వినియోగదారుల భద్రత, విశ్వాసానికి ముప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటివి చట్టపరమైన ఉల్లంఘనలకు దారితీస్తుందని, వీటిని నిరోధించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను సూచించారు.
ఐటీ చట్టం కింద కఠిన నిబంధనలను త్వరలో తెలియజేస్తామని ఆయన ట్వీట్ చేశారు. డీప్‌ఫేక్ వీడియోపై స్పందిస్తూ ఈ వీడియో నకిలీదని ఈ రకంగా సాంకేతికతను దుర్వినియోగం చేయడం తప్పు, మీరు అలాంటి వీడియోలు, యాప్‌లు లేదా ప్రకటనలు చూసినట్లైతే వాటిని వెంటనే నివేదించాలని ఎక్స్(ట్విట్టర్)లో కోరారు.